తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎంతో సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయని, పదేళ్లలో ఓ విప్లవం చూస్తామని హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసీ అన్నారు. మైనారిటీల సంక్షేమంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన రివ్యూలో రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్వహణపై అసదుద్దిన్ ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా మంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో బోధన, వసతి, ఆహారం బాగున్నాయని ఎంపీ అసదుద్దిన్ కొనియాడారు.మైనారిటీల సంక్షేమం కోసం అన్ని రకాల వ్యయాల కన్నా, రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం పెట్టే ఖర్చు తనకు ఎంతో తృప్తినిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. రేపటి తరానికి మంచి విద్యను అందించడం కన్నా మించిన ఆస్తి ఏదీ లేదని సీఎం చెప్పారు. తమకు సెక్షన్లు పెంచమని, అదనపు స్కూళ్లు కావాలని ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వస్తున్నది సీఎం వెల్లడించారు.