కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు మేకవన్నె పులి నైజం బయటపడిందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. నీచమైన, నికృష్టమైన నైజం మాజీ మంత్రి శ్రీధర్ బాబు సొంతమని… టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని గంజాయి కేసు లో ఇరికించాలని చూసిన వైనం బట్టబయలవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో నిర్వహించిన విలేకరుల సమావేశలో ఎమ్మెల్సీ లు భానుప్రసాద్, గంగాధర్ గౌడ్‌తో కలిసి ఎంపీ బాల్కసుమన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీధర్ బాబు మేకవన్నె పులి నైజం ఈ ఉదంతంతో బయటపడిందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు తప్పుడు కేసులు పెట్టించారని ఎంపీ బాల్క సుమన్ గుర్తు చేశారు. బండారం బట్టబయలయినప్పటికీ…శ్ రీధర్ బాబుకు బుద్ది రాలేదని…సిగ్గు లేకుండా కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకోకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజానికి శ్రీధర్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమది గొప్ప కుటుంబం అంటున్న శ్రీధర్ బాబు… తప్పుడు కేసులు పెట్టడాన్ని గొప్పగా భావిస్తున్నారా అనేది చెప్పాలని కోరారు. పెద్దపల్లి ఎంపీగా తాను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా .. శ్రీధర్ బాబు పై కఠిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల దుష్ట పన్నాగాలకు చెక్ పెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పుట్టా మధును రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాకే శ్రీధర్ బాబు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా శ్రీధర్ బాబు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించారని గుర్తుచేశారు. తెలంగాణ లో పోలీస్ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. శ్రీధర్ బాబు లాంటి వ్యక్తులను పోలీస్ లు ఉపేక్షించకూడదని అన్నారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూశ్రీధర్ బాబు నిజ స్వరూపం బయట పడిందని…తప్పుడు కేసులతో శ్రీధర్ బాబు టీఆర్ఎస్ నాయకుల ఆత్మ స్తయిర్యాన్ని దెబ్బ తీయలేరన్నారు. శ్రీధర్ బాబు పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస వంద సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.