ఎంతటి విద్య … మరెంతటి సంపద వున్నా, ఆ పేరు ప్రతిష్ఠలు చూసుకోవడానికి … ఆ సంపదను అనుభవించడానికి ఆరోగ్యం – ఆయుష్షు వుండాలి. కాబట్టి దైవం ఎదురుగా కనబడితే చాలు అందరూ కోరుకునేవి ఈ రెండే. బలవర్ధకమైన పోషక పదార్థాలను ఆహారంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునేమోగాని, ఆయుష్షు అనేది ఎవరి చేతుల్లోను వుండదు.
అయితే .. రోజుకు కనీసం మూడుసార్లయినా తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే దీర్ఘాయువుతో జీవించవచ్చని తమ అధ్యయనంలో తేలిందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతుంటే..
మరికొంత మంది శాస్ర్తవేత్తలు బరువు పెరగకుండా చూసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండండి అంటున్నారు బ్రిటన్ లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్ర్తవేత్తలు. దాదాపు 6 లక్షల మంది జన్యు సమాచారంతో పాటు వారి తల్లిదండ్రుల ఆయుర్ ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా ప్రొఫెసర్ జిమ్ విల్సన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాకొచ్చింది. ప్రతి అదనపు కేజీ బరువుకు ఆయువు 2 నెలల వరకు తగ్గుతుందని.. అలాగే దీర్ఘాయువుకు సంబంధించిన జన్యువులకు జ్ఞాన సముపార్జనకు మధ్య సంబందమున్నట్లు తమ పరిశోధనల ద్వారా స్పష్టమైందని జిమ్ చెబుతున్నారు. కొన్ని రకాల అలట్లకు జన్యువులు కారణమని ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో జిమ్ బృందం ఆయువును ఎక్కువగా ప్రభావితం చేయగల అలవాట్లను స్పష్టంగా గుర్తించగలిగింది. ధూమపానం, ఊపిరితిత్తుల కేన్సర్ లక్షణాలు ఆయువుపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమైంది.
