రేషన్ షాపుల ద్వారా అందే నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు, అక్రమాలు తొలగించడానికి, లబ్దిదారులకు సంపూర్ణ ప్రయోజనం అందించడానికి అనువైన విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. రేషన్ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పౌర సరఫరాల సంస్థ కమీషనర్ సివి ఆనంద్, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, వాకాటి కరుణ, శాంత కుమారి, స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘ప్రతీ ఏటా ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో పేదల కోసం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు ఎంతో మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తలమునకలవుతోంది. అటు వేల కోట్ల ఖర్చు అవుతుంది. ఇటు అధికారుల సమయం పోతున్నది. అయినా సరే, ఆశించిన ఫలితం రావట్లేదు. లబ్ది దారులకు అందాల్సిన బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణా మాఫియానే ఏర్పడింది. ఉన్నతాధికారులను కూడా మేనేజ్ చేసే స్థాయికి అక్రమ దందా నిర్వహించే వారు చేసుకున్నారు. ప్రతీ రోజు పేపర్లలో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యం పట్టివేత అనే వార్తలు వస్తున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంపై రోజూ వస్తున్న వార్తలు, వెలుగు చూస్తున్న అక్రమాలు మనోవేదన కలిగిస్తున్నాయి. ఇంత ఖర్చు చేసినా, ఎంతో శ్రమ చేసినా చెడ్డపేరు వస్తున్నదనే బాధ కలుగుతున్నది. ఈ పరిస్థితి పోవాలి. పేదల కోసం పెడుతున్న ఖర్చు నూటికి నూరు శాతం పేదలకే ఉపయోగపడాలి. ఇందుకోసం ఓ మంచి విధానం అమలు చేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
డిబిటిపై సిఎంకు వివరించిన అధికారులు
ముఖ్యమంత్రి సూచన మేరకు అధికారులు స్పందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో వచ్చిన మార్పులను వివరించారు. ముఖ్యంగా రేషన్ షాపుల ద్వారా సరుకులు అందించే బదులు నగదునే నేరుగా లబ్దిదారులకు అందించే విధానం(DIRECT BENIFIT TRANSFER) అమలులో ఉందని చెప్పారు. చండీఘర్, పాండిచ్చేరి, దాద్రా హవేలి లాంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ ద్వారా అందే సరుకులకు బదులుగా నేరుగా లబ్దిదారుల ఖాతాలోనే దానికి సంబంధించిన డబ్బులను జమచేస్తున్నారని వివరించారు. అదే విధానం అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కూడా పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 2013లో యుపిఎ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టం (ఫుడ్ సెక్యూరిటీ యాక్టు – యాక్టు 20/2013) కూడా సబ్సిడీల ద్వారా అందించే లబ్దిని నగదు రూపంలో నేరుగా లబ్దిదారులకు అందించాలనే సూచన ఉందని చెప్పారు. సరుకుకు బదులుగా నగదునే లబ్దిదారులకు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. ప్రస్తుతం ఆహారం కోసం బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నామని, అదీ నిర్ణీత సమయంలో అందిస్తున్నామని చెప్పారు. బియ్యం కాకుండా నగదు అందిస్తే లబ్దిదారులు వారి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా సరుకులు కొనుగోలు చేసుకుంటారని, ఏది కొనాలి? ఎప్పుడు కొనాలి? అనే చాన్స్ కూడా లబ్దిదారుడికే ఉంటుందని చెప్పారు. కాబట్టి, రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులకు బదులుగా అంతే మొత్తం నగదును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వారు సిఎంకు సూచించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేషన్ షాపుల ద్వారా బియ్యం అందించడం ఉత్తమమా? నగదును లబ్దిదారులకు నేరుగా అందించడం ఉత్తమమా అనే విషయంపై ఆలోచించాలని కోరారు.
సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
రేషన్ డీలర్లు సమ్మెకు నోటీసు ఇచ్చినందున లబ్దిదారులకు ఇబ్బంది కలగని విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. డీలర్లు సమ్మె ఆలోచన విరమించుకోకుంటే, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సాధ్యం కాదు కాబట్టి, దానికి సంబంధించిన నగదును నేరుగా లబ్దిదారులకే అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు.