అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా తెలుగు ప్రాంతం కూడా ఉండటం వల్ల, తెలుగు సినిమా తొలినాటి ప్రయత్నాలన్ని మద్రాస్‌లోనే ఊపిరిపోసుకున్నాయి. దక్షిణభారతదేశంలో మొదటి స్వదేశీ థియేటర్ గెయిటీ థియేటర్ స్థాపించిన దర్శకుడు తెలుగువాడు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన నిర్విరామ కృషివల్లే 1920 ప్రాంతంలో మద్రాస్‌లో తెలుగు సినీ పరిశ్రమ రెక్కలు తొడుక్కుంది. 1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ తెలుగువారు తీసిన తొలి మూకీ సినిమా కావడంలో ఆయన కృషి ఎంతో ఉంది.
ఇక ఆ తర్వాత 1931 సెప్టెంబర్ 15న తొలిటాకీ భక్త ప్రహ్లాద విడుదలై, దక్షిణాదిలో తొలితరం సినీ పరిశ్రమలో తెలుగుకు కూడా ఒక స్థానాన్ని అందించింది. 1970 దశకం అనంతరం పూర్తిగా హైదరాబాద్‌కు షిఫ్టయి, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ కేంద్ర బిందువుగా మారింది. తొలినాళ్లలో పౌరాణికాలు, మాలపిల్ల, రైతుబిడ్డవంటి సాంఘికాలతో మొదలైన తెలుగు సినిమా, ఆ తర్వాత పాతాళభైరవి వంటి జానపదాలతో బహుళ జనాదరణ పొందింది. అలా తెలుగు సినిమా అన్ని జానర్లలోకి విస్తరించి ప్రస్తుతానికి దాదాపు 6 వేలకు పైనే సినిమాలను సృష్టించిన ఇండస్ట్రీగా, బాలీవుడ్ తర్వాత అత్యధిక చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కీర్తిని సాధించింది.
తెలుగు సినిమా తొలితరంలో చిత్తూరు నాగయ్య స్టార్ హీరోగా ఎదగగా, ఆ తర్వాత తరంలో ఎన్టీర్-అక్కినేని, కృష్ణ-కృష్ణంరాజు-శోభన్‌బాబు, ఆ తర్వాత తరంలో చిరంజీవి-బాలకృష్ణ సూపర్‌స్టార్స్‌గా అవతరించారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలు తెలుగు సినిమాకు దిశా నిర్దేశకులయ్యారు. తెలుగు సినిమా ప్రధానంగా సీమాంధ్ర ప్రాంతపు నిర్మాతలు, దర్శకులు, నటుల గుప్పిట్లో ఉండటంవల్ల కేవలం వినోదప్రధానమైన సినిమాలు, మాస్ కమర్షియల్ సినిమాలు మాత్రమే వస్తున్నాయి.
అలా నేటి తెలుగు సినిమా అనగానే మాస్‌మసాలా సినిమాలే తప్ప మానవీయ సినిమాలు కనీసం గుర్తుకైనా రాని పరిస్థితి దాపురించింది. తెలుగు సినిమా తొలినాళ్ళలో బంగారుపాప వంటి సినిమాల్లో కనిపించిన మానవత, సామాజిక స్ఫూర్తి పూర్తిగా కొరవడి ఇప్పుడు కేవలం హింస, ప్రతీకారం, విధ్వంసం వంటి అంశాలే తెలుగు సినిమా అనే ముద్ర పడిపోయింది. కంచె, గమ్యం, వేదం, బొమ్మరిల్లు, ఓనమాలు, మిథునం వంటి ఆలోచనాత్మకమైన సినిమాలు కొద్ది సంఖ్యలోనైనా రాగా.. బాహుబలి, గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాయి.