మన దేశంలో సినిమా ప్రస్థానం వందేళ్ళ క్రితం ఆరంభం అయ్యింది. తెలుగులో సినిమాల నిర్మాణం 81 ఏళ్ళ క్రితం ఊపిరిపోసుకుంది. ఇన్నాళ్ళ కాలంలో జాతీయస్థాయిలో తెలుగు సినిమా మరే ప్రాంతీయ సినిమా సాధించనంత అద్భుత ప్రగతిని సాధించింది. అన్నింటినీ మించి హిందీ తర్వాత రెండో భారీ సినిమా పరిశ్రమగా అవతరించడమేకాక, సినిమాల సంఖ్యాపరంగా కూడా తెలుగు సినిమా జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. అయితే భారీ బడ్జెట్‌లు, సినిమాల సంఖ్య, భారీ లాభాలు, కోట్లాది ప్రేక్షకులు వంటి బలమైన పునాదులను ఏర్పరుచుకున్న తెలుగు సినిమా జాతీయ స్థాయి అవార్డుల విషయంలో మాత్రం చివరినుంచి రెండో స్థానంలోనే ఉంటోంది.
ప్రతి ఏటా ప్రకటిస్తున్న జాతీయ చలనచిత్ర అవార్డులలో కూడా ఇదే విషయం రుజువు అవుతోంది. సంవత్సరానికి పట్టుమని పది సినిమాలు కూడా రాని మరాఠీ సినీ పరిశ్రమ ఏకంగా ఎనిమిదికి పైగా అవార్డులను ఎగరేసుకుపోగా, సంవత్సరానికి 120 పైగా సినిమాలను సృష్టించే తెలుగు సినీ రంగం మాత్రం కేవలం రెండు, మూడు అవార్డులతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ పరిణామానికి మనం ఎవరిని తప్పుపట్టాలి.. జాతీయ అవార్డులలో ఉత్తర- దక్షిణాల వివక్షనా.. తెలుగు సినీ పరిశ్రమనా.. తెలుగు ప్రేక్షకులనా.. తెలుగు దర్శక నిర్మాతలనా.. కేవలం మాస్ సినిమాలను మాత్రమే ప్రోత్సహిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న హీరోలనా.. ఈ వైఫల్యంలో ఎవరి వాటా ఎంత.. ఈ ప్రశ్నలే ఇప్పుడు సినీ ప్రేమికుల మస్తిష్కాలను మరోసారి తొలుస్తున్నాయి.