పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద గల పన్నెండవ బెటాలియన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.సమాజ క్షేమం కోసం పోలీసులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతరని కొనియాడారు. పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో తెలంగాణ పోలీసులు యావత్ దేశాన్ని ఆకట్టుకున్నరని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను ఆధునీకరించి, సాంకేతికతను జోడించారన్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని గుర్తుచేశారు. ఇది సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జడ్పీ ఛైర్మన్ బాలునాయక్, ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, వేముల వీరేశం, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సంస్మరణ దినోత్సవ వేడుకలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.