వరంగల్ రూరల్ జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా సభా వేదికను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు.
వేదిక వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ …రేపు వరంగల్ కు సంబంధించి 4 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 11వేల కోట్ల పెట్టుబడులు పెట్టి, 1,20,000 మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, 74 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, కాజీపేట-హన్మకొండ ఆర్వోబి, మడికొండలో ఐటీ పార్క్ విస్తరణ ఉన్నాయన్నారు.వరంగల్ పై ప్రత్యేక శ్రద్ధ తో సీఎం కేసీఆర్ వేల కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో ని ప్రజలు దాదాపు2 లక్షల మంది సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలకనున్నారు.దాదాపు 2లక్షల ప్రజలు సభకు రావడానికి 2000 ఆర్టీసీ బస్సులు, 500 ప్రైవేట్ వాహనాలు 500 డిసిఎం లు, 5000 ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఏర్పాటు చేస్తున్నాము.ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు సభకోసం వినియోగిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత ప్రయాణాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున వీలైనంత వరకు ప్రయాణాలు రద్దుగానీ, వాయిదా గానీ వేసుకోవాలని కోరారు.సభకు వరంగల్ నుంచి పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలని కోరారు.ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ లో ఉనికి కోల్పోయాయని, ప్రజల ఆదరణ వాటికి లేదన్నారు. బహిరంగ సభ ద్వారా ప్రతిపక్ష పార్టీల కు సమాధానం చెబుతామన్నారు.
అనంతరం సభకు వచ్చే వాహనాలకు రూట్లు, పార్కింగ్ సదుపాయాలు, విఐపిల వసతులు, సభా వేదిక రూపకల్పన, సభకు తరలివచ్చే జనాలకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, టాయిలెట్స్ నిర్మాణం, రెండు హెలిప్యాడ్ల్ నిర్మాణం వంటి అంశాలను పర్యవేక్షించారు.భారీ ఎత్తున జనాలు రానున్న సందర్భంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సభా వేదిక వరకు చేరుకునేలా అందరూ సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. సమావేశానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సీపీ సుధీర్ బాబు, వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ శ్రుతి ఓజా, ఆర్డీఓ మహేందర్, మమునూర్ ఏసీపీ శోభన్, ఇతర అధికారులు హాజరయ్యారు.