తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం మెర్సల్ డైలాగుల వివాదం ముదురుతోంది. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటికే తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఈ సినిమాలోని డైలాగుల విషయంలో రాజకీయ నేతల నుండి స్పందనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు డైలాగుల విషయంలో బీజేపీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను ఈ సినిమాలో అవమానించారని, అబద్ధపు సమాచారంతో దేశం పరువును తీస్తున్నారని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు బీజేపీ విభాగం అధ్యక్షురాలు తమిళసై కూడా ఈ విషయంలో స్పందించారు. తక్షణం ఆ డైలాగులను కట్ చేయాలనేది ఆమె డిమాండ్ చేశారు.
అయితే ఈ సినిమాకు మద్దతు కూడా లభిస్తోంది. ఇందులో ఎలాంటి డైలాగులనూ కట్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నాడు విశ్వనాయకుడు కమల్ హాసన్. రాజకీయాల్లోకి వచ్చేసినట్టే అని ప్రకటించిన కమల్ మెర్సల్ వివాదంపై స్పందించారు. కొత్తగా ఈ సినిమాను సెన్సార్ చేయాల్సిన అవసరం లేదని, రాజకీయ పార్టీలకు అభ్యంతరకరమైన డైలాగులను కట్ చేయాల్సిన అవసరం లేదని కమల్ అభిప్రాయపడ్డారు. సినిమా విడుదలకు ముందే సెన్సార్ అయ్యింది కదా, ఇక మళ్లీ కట్ చేయడం ఏంటని కమల్ ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా మరికొందరు పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ మెర్శల్ సినిమా తమిళనాడులో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డ్స్ దిశగా దూసుకెళ్తుంది.