తెలంగాణ రాష్టం లో గత మూడున్నర సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తనదైన శైలిలో ముందుకెళ్తున్న మంత్రి కేటీఆర్, తన నియోజకవర్గ ప్రజలకు ఏచిన్న కష్టమొచ్చినా అండగా నిలుస్తున్నారు. తన వద్దకు వచ్చే అభాగ్యులకు తానున్నాంటూ భరోసా ఇస్తున్న ఆయన, ఏడాది క్రితం పర్యటనలో తన గోడు వెల్లబోసుకున్న ఓ వృద్ధురాలికి ఇల్లు కట్టించి,” మనసున్న మారాజు ” అనిపించుకున్నారు. ఆ ఇల్లు పూర్తి కాగా, నేడు సందర్శించేందుకు సిరిసిల్లకు వెళ్లనున్నారు .
ఆపద, అత్యవసర సమయాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. జిల్లాలో పర్యటిస్తున్న సమయాల్లో ప్రజా సమస్యలు వింటూ అండగా నిలబడుతున్నారు. ఈ యేడాది ఫిబ్రవరి 23న తంగళ్లపల్లి మండలం రాంచంద్రాపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కలిసిన గ్రామానికి చెందిన మేడిపెల్లి నీలవ్వ తమకు నిలువ నీడలేదని మంత్రికి విన్నవించింది. మగ పిల్లలందరూ చనిపోయారనీ, కూతురు వసంతతో కలిసి దయనీయ పరిస్థితుల్లో ఉన్నానని గోడు వెల్లబోసుకుంది. దీనికి చలించిన మంత్రి కేటీఆర్ వెంటనే రూ.22 వేల ఆర్థిక సాయంతోపాటు సొంతంగా ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న సుతారికి డబ్బులిచ్చి పనులు ప్రారంభించాలని సూచించారు.
ఇటీవల ఈ ఇల్లు పూర్తయ్యింది. మంత్రి కేటీఆర్ రూ.5.50 లక్షలకు పైగా వెచ్చించి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఆయన పీఎస్‌లు శ్రీనివాస్, గన్‌రాజ్‌లను అప్రమత్తం చేస్తూ ఇళ్లు పూర్తయ్యేలా చూశారు. ఈ ఇళ్లు రెండు పడక గదులు, హాలు కిచెన్‌లు ఉండేలా నిర్మాణం చేశారు. ఈ మేరకు శనివారం మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించనుండగా మొదట తంగళ్లపల్లి మండలం రాంచంద్రాపూర్‌లో తాను కట్టించిన ఇంట్లో ఉంటున్న నీలవ్వను కలవబోతున్నారు. మంత్రి కేటీఆర్ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని, ఆయనే మాకు పెద్ద దిక్కై ఇళ్లు కట్టించడం మా అదృష్టమంటూ సంబురపడుతుంది నీలవ్వ.