జయదీపిక (20) హత్య కేసు మిస్టరీ వీడింది. కన్న తండ్రే ఆమెను హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసినట్లుగా వారు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో అక్టోబర్ 16న అర్ధరాత్రి నందుల జయదీపిక తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ పరువు హత్య కేసులో అసలు నిందితుడు ఆ యువతి తండ్రి, రామచంద్రపురం టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ అలియాస్ నందుల రాజు అని డీఎస్పీ జె.వి. సంతోష్.. శుక్రవారం (అక్టబర్ 20) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో కవల సోదరుడు జయప్రకాశ్ నాయుడే ఆమెను హత్య చేశాడంటూ రాజు ఆడిన నాటకం చివరికి బట్టబయలైంది.
టీడీపీ నేత రాజుకు జయదీపిక, జయప్రకాశ్ నాయుడు అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. జయదీపిక ఎ.అగ్రహారం కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇటీవల ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు అతడి దృష్టికి వచ్చింది. దీంతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని భావించాడు. ఈ క్రమంలో అక్టోబర్ 16న అతడు తన కూతుర్ని చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపర్చడంతో ఆమె మరణించింది.
అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో నందుల రాజు ఇంటికి వచ్చిన బార్‌లో పనిచేసే ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న జయదీపికను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీపికను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
తన కుమార్తె ఇటీవల ప్రేమ వ్యవహారం నడుపుతోందని కొడుకు జయప్రకాశ్ నాయుడు తనకు చెప్పాడని, దీపికను అతడే హత్య చేసి ఉంటాడని రాజు పోలీసులతో చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా అసలు నిజం బయటపడింది. దీంతో రాజును అరెస్టు చేశారు.