సీతాఫలం… ఈ సీజన్‌లో మనకు లభించే పండ్లలో ఇది కూడా ఒకటి. దీంట్లో విటమిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6, కాల్షియం, విటమిన్ సి, ఐరన్ వంటి అత్యంత ముఖ్యమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీన్నినిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దాంతో మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు దూరమవుతాయి. సీతాఫలమే కాదు దీని ఆకులు, బెరడు, వేరు… ఇలా అన్ని భాగాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటితో కలిగే లాబాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- శరీరంపై సెగ గడ్డలు అయితే కొన్ని సీతాఫలం ఆకులను తీసుకుని, నూరి ఆ మిశ్రమాన్ని కట్టులా కట్టాలి. దీంతో సెగ గడ్డల సమస్య తగ్గుముఖం పడుతుంది.
- సీతాఫలం ఆకుల నుంచి తీసిన రసాన్ని నిత్యం ఉదయాన్నే ఒక టీస్పూన్ మోతాదులో తాగుతుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు.
- సీతాఫలం చెట్టు నుంచి తీసిన బెరడును నీటిలో వేసి దాంతో కషాయం కాచుకుని తాగితే డయేరియా వంటి అనారోగ్యాలు తొలగిపోతాయి.
- సీతాఫలం ఆకులను నీటిలో వేసి కషాయంలా కాచుకుని తాగుతుంటే జలుబు తగ్గుతుంది.
- సీతాఫలాన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే దాంతో కండరాలు, నరాల బలహీనతలు తొలగిపోతాయి. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
- విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వల్ల కంటి రోగాలు తొలగిపోతాయి. దృష్టి సమస్యలు దూరమవుతాయి.
- సీతాఫలంలో ఉండే మెగ్నిషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి.
- సీతాఫలాన్ని రోజూ తింటుంటే కడుపులో ఉండే నులిపురుగు చనిపోతాయి. అల్సర్లు నయమవుతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
- రక్తం తక్కువగా ఉన్న వారు సీతాఫలాలను తినడం మంచిది. దీంతో రక్తం తయారవుతుంది.
- శరీరంలో బాగా వేడి ఉన్న వారు సీతాఫలాలను తింటే వెంటనే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- చిన్నారులు, బాలింత తల్లులకు సీతాఫలం చక్కని పోషకాలను అందిస్తుంది. వారికి తగిన శక్తి లభిస్తుంది.
- ఎదుగుతున్న పిల్లలు నిత్యం సీతాఫలాన్ని తింటుంటే దాంతో కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. దీని వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
- శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడంలో సీతాఫలం బాగా ఉపయోగపడుతుంది. రక్తం శుద్ధి కూడా అవుతుంది.
- సీతాఫలం గుజ్జును తీసుకుని రసంలా చేసి దానికి పాలు కలిపి పిల్లలకు తాగించాలి. దీంతో వారికి సత్వర శక్తి లభిస్తుంది.
- సీతాఫలం ఆకుల్ని మెత్తగా నూరి రాస్తే గాయాలు, గజ్జి, తామర వంటి సమస్యలు పోతాయి.
- వీటి ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద ఉండదు.
- సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి.
- గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది.
అయితే సీతాఫలాన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు. లేదంటే కడుపులో మంట, ఉబ్బరం బాధిస్తాయి. అలాంటప్పుడు వేడినీరు తాగినా, అరచెంచా వాము లేదా ఉప్పు నమిలినా ఉపశమనం లభిస్తుంది. అలాగే మధుమేహ వ్యాధి గ్రస్తులు, ఊబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాతో తీసుకోవాలి. లేదంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.