వచ్చే నెల సంగారెడ్డిలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభిచనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు.
సమైక్య రాష్ట్రంలో 6 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో కొత్తగా 34 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు ద్వారా పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గి, మెరుగైన వైద్యం అందుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా సింగిల్ యూసేజ్ ఫిల్టర్ సిస్టం ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా కార్డియాలజి, యురాలజి సెంటర్స్‌ను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే సెంట్రల్ డయాగ్నొసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు మెరుగు పడిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 4 నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 40 శాతం పెరిగాయని ఈసందర్బంగా తెలియజేశారు.