కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్ పోర్టుకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. రాజధాని అమరావతిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ఓర్వకల్లుతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదరి విమానాశ్రయాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విమానాశ్రయ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదిత భూమి చుట్టూ రక్షణగోడ, రెండవ దశలో టర్మినల్ భవనాలు, తుది దశలో రన్‌వే నిర్మిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. రక్షణ గోడ నిర్మాణం పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తారని వెల్లడవుతోంది. గోడ దూకడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే రక్షణాధికారి కార్యాలయానికి తెలిసేలా ఏర్పాట్లు చేస్తారని తెలుస్తోంది. ఇక టర్మినల్ భవనంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన లాంజ్, హోటల్, ప్రయాణికుల బంధు, మిత్రులు వేచిఉండేందుకు రెండు ప్రత్యేక గదులు, ఏటిసి టవర్, తదితరాలు ఉంటాయంటున్నారు. ఇక చివరి దశలో ప్రస్తుతం 2 కి.మీ రన్‌వే నిర్మాణం, విమానాశ్రయంలోకి అధికారిక వాహనాలు తిరగడానికి సిమెంటు రహదారులు నిర్మిస్తారని స్పష్టమవుతోంది. కాగా విమానాశ్రయ నిర్మాణం 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. విమానాశ్రయ నిర్మాణానికి రూ. 325కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా సుమారు 6 కంపెనీలు టెండరు ప్రక్రియలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇందులో తక్కువ ధరకు టెండరు దాఖలు చేసిన కంపెనీకి టెండరు దక్కిందని ఆ కంపెనీతో నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన ఒప్పంద పత్రాలు మరో రెండు, మూడు రోజుల్లో స్వీకరించి పనులను అప్పగిస్తారని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.. టెండరు ప్రక్రియ ముగియడంతో ఇక పనుల ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రధాని తిరుపతి పర్యటన ఖరారైనందున అదే రోజు కర్నూలులో కూడా శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేస్తారని, లేదంటే తిరుపతి నుంచే రిమోట్ ద్వారా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది.
