ఏపీ ప్రధాన ప్రతిపక్షం జగన్ పాదయాత్ర సవ్యంగా సాగుతుందీ లేనిదీ నేడు తెలియనుంది. ఈరోజు సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జగన్ వచ్చే నెల 2వ తేదీ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు వేల కిలోమీటర్ల యాత్ర ఆరు నెలల పాటుసాగనుంది. అయితే సీబీఐ కోర్టుకు జగన్ తన కేసుల విషయమై ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైతే పాదయాత్రలో వారానికి ఒకరోజు బ్రేక్ పడుతుంది. పాదయాత్రలో ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా హైదరాబాద్ జగన్ రావాల్సి ఉంటుంది. పాదయాత్రకు ఒకరోజు విరామం ప్రకటించాల్సి ఉంటుంది.
అయితే ఈనేపథ్యంలోనే జగన్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు ఈ విషయాన్ని సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పడంతో జగన్ గత వారం సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనను ప్రతిశుక్రవారం కోర్టు హాజరునుంచి మినహాయించాలనికోరారు. అయితే ఇదే సందర్భంలో సీబీఐ కూడా పిటీషన్ దాఖలు చేసింది. అనేక కేసులు ఇప్పటికే విచారణ దశలో ఉన్నాయని, వారానికి ఒక్కరోజూ మినహాయింపు ఇస్తే ఎలా.. అని సీబీఐ కోర్టు తర కౌంటర్ పిటీషన్‌లో ప్రశ్నించింది. దీనిపై సీబీఐ కోర్టులో ఈ శుక్రవారం విచారణ జరగనుంది. మరి జగన్ కు అనుకూలంగా వస్తే పాదయాత్రకు ఎలాంటి బ్రేకులు పడవు. అదే వ్యతిరేకంగా ఇస్తే వారం..వారం కోర్టుకు రాక తప్పదు. దీంతో కోర్టు తీర్పు కోసం సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.