సాధారణంగా హీరోయిన్లు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు చేస్తుంటారు. ఆయా చిత్రాలు అదే సంవత్సరంలో విడుదల అవుతాయా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలూ ఒకేరోజు విడుదలైన సందర్భాలూ ఉన్నాయి. గతంలో ఆర్తీ అగర్వాల్ నటించిన ఇంద్ర, అల్లరిరాముడు చిత్రాలు సంక్రాంతి కానుకగా ఒకేరోజు వచ్చాయి. తాజాగా టాలీవుడ్‌లో వర్థమాన నటి మెహరీన్ నటించిన చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. మరో రెండు నెలల్లో మరో రెండు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
నాని కథానాయకుడిగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ మెహరీన్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టి విజయం సాధించింది. అనంతరం గత నెలలో శర్వానంద్ హీరోగా వచ్చిన మహానుభావుడు తో మరో సక్సెస్‌ను మెహరీన్ తన ఖాతాలో వేసుకుంది. ఆమె కథానాయికగా నటించిన మరో చిత్రం రాజా ది గ్రేట్ తాజాగా విడుదలై మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ ఏడాది చివరిలోపు ఆమె నటించిన మరో రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. సాయిధరమ్‌తేజ్ జవాన్, సందీప్‌కిషన్ కేరాఫ్ సూర్య చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఆ రెండూ విడుదలైతే నాలుగు నెలల వ్యవధిలో తాను నటించిన నాలుగు చిత్రాలు విడుదలైన హీరోయిన్‌గా మెహరీన్ నిలవనుంది. ఆ రెండూ సక్సెస్ అయితే సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లోనే నాలుగు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఘనత మెహరీన్‌కు దక్కుతుంది.
