ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావ, ఈడో రకం వాడో రకం సినిమాలతో రాజ్ తరుణ్ హిట్స్ అందుకున్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం వరుస డిజాస్టర్లతో సతమతవుతున్నాడు. ఓ హిట్ పడితే కానీ మనోడి జాతకం మారదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో నూతన దర్శకురాలు సంజనారెడ్డి దర్శకత్వంలో రాజుగాడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2018 సంక్రాంతి బరిలో దించుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేసారు.
ఇక ఈ సినిమాలో హీరో ఓ వింత జబ్బుతో బాధపడుతుంటాడట. ఇటీవల భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు చిత్రాలు ఇదే తరహా కథా కథనాలతో తెరకెక్కి మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అదే బాటలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రాజు గాడు సినిమాలో హీరో బుద్ధి అని ఆదీనంలో ఉండదు. తనకు తెలియకుండానే తాను దొంగతనం చేసేస్తుంటాడు. ఇలాంటి వింత వ్యాధి కారణంగా హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నదే సినిమా కథ.ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాజేంద్రప్రసాద్‌గారు, రావు రమేష్‌గారు కీలక పాత్రల్లో నటించారు.