హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అరుదైన గౌరవం దక్కింది. 2016లో ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించినందుకు (5-15 మిలియన్ల కేటగిరీ) ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానం దక్కింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో ఈ గుర్తింపు లభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) సంస్థ బుధవారం (అక్టోబర్ 18) తెలిపింది. మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌లో జరిగిన సదస్సులో ఈ అవార్డును ఏసీఐ డైరెక్టర్ అంగేలా గిట్టెన్స్ నుంచి జీహెచ్‌ఐఏఎల్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ అందుకున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.
ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలటీ సర్వే ప్రకారం.. రాజీవ్ గాంధీ విమానాశ్రయం తన స్కోర్‌ను క్రమంగా పెంచుకుంది. 2009లో ఈ స్కోర్ 4.4 ఉండగా.. 2016 నాటికి 4.9కి చేరింది. ఆర్‌జీఐఏకు తాజాగా ఈ అవార్డు దక్కటం పట్ల ఎస్‌జీకే కిశోర్ ఆనందం వ్యక్తంచేశారు. ఈ అవార్డుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.