డేరా బాబా తరువాత దేశంలో ఎక్కడ బడితె అక్కడ దొంగ బాబాలు దొరికిపోతున్నారు. తాజాగా మరో నకిలీ బాబా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాబా ఆశ్రమానికి ఇరుగుపొరుగువారు ఓ మహిళతో అక్రమసంబంధం ఉన్నట్టు ఆరోపించారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఆ దొంగబాబా ఏకంగా తన జననాంగాన్ని కోసుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే…
రాజస్థాన్ రాష్ట్రంలోని తారానగర్‌లో సంతోష్ దాస్ (30) అనే వ్యక్తి నకిలీ బాబాగా చెలామణి అవుతున్నాడు. ఈ బాబాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అదేసమయంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉంది. ఈ ఆరోపణలు మరింతగా ఎక్కువ కావడంతో తనను తాను దైవంగా ప్రకటించుకున్నాడు.
ఈనేపథ్యంలో ఆయన దొంగబాబా అని, అతనికి ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందని ఇరుగుపొరుగువారు ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన ఆయన.. అక్కడికక్కడే తన జననాంగాన్ని కోసేసుకున్నారు. దీంతో ఆయనపై ఆరోపణలు చేసిన వారు బిత్తరపోయారు. వెంటనే ఆయనను బికనేర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.