తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో తాండూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత ఆయూబ్ ఖాన్ కొన్ని రోజుల క్రితం పార్టీలో తనకు సముచిత గౌరవం, గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటిఆర్, మహేందర్ రెడ్డి ఈరోజు ఆయన కుటుంబానికి తెరాస పార్టీ తరపున రూ.30 లక్షలు చెక్కును బేగంపేట క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన అయూబ్ ఖాన్ వంటి మంచి నేతను కోల్పోవడం తనకు చాలా బాధ కలిగించిందని మంత్రి కేటిఆర్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరికీ ఖచ్చితంగా తగిన గుర్తింపు లభిస్తుందని, కనుక తొందరపడి ఎవరూ ఇటువంటి పనులకు పూనుకొని బార్యాబిడ్డలను రోడ్డున పడేయవద్దని కోరారు. ఆయూబ్ ఖాన్ కుటుంబానికి ఇక ముందు కూడా తెరాస అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి కేటిఆర్ భరోసా ఇచ్చారు. తనకు ఆర్ధికసహాయం అందించినందుకు ఆయూబ్ ఖాన్ భార్య మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
