టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న రవితేజ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. తమ్ముడి మరణం, డ్రగ్స్ కేసు గురించి రవితేజ స్పందించాడు. అయితే మీడియాలో తమ కుటుంబం గురించి అవాస్తవ ప్రచారం జరిగిందని, అవి తమనెంతో బాధించాయని రవితేజ ఆవేదన వ్యక్తం చేశాడు. తన తమ్ముడి అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదనే విషయంలో ప్రతీ ఒక్కరికీ తాను సమాధానం చెప్పలేనని కామెంట్ చేశాడు.
ఇక ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తమ కులంలో పాటించాల్సిన ఆచారాలు కొన్ని ఉన్నాయని, అందుకే తన తమ్ముడి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయానని రవితేజ చెప్పాడు. తన తల్లిదండ్రులు భరత్ మరణ వార్త విని కుప్పకూలిపోయారని, క్రతువు నిర్వహించే స్థితిలో కూడా వాళ్లు లేరని తెలిపాడు. అందుకే అంత్యక్రియలను తన అంకుల్ నిర్వహించారని రవితేజ వివరించాడు. అయినా ఆ ఘటన గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని రవితేజ వ్యాఖ్యానించాడు.