వైద్య విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మేడ్చల్ మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పూడూర్ గ్రామ పరిధిలోని బీఎన్‌ఆర్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం మెడిసిటీ ఆస్పత్రి సమీపంలో విద్యార్థులను ఇంటి వద్ద దింపి తిరిగి వస్తోంది. ఘనాపూర్ వద్ద బస్సు వెనుక మెడికల్ కాలేజీ విద్యార్థులు మద్యం మత్తులో అతివేగంతో కారుతో ఓవర్ టేక్ చేయబోయారు. కొంత ముందుకు వెళ్లిన తర్వాత కారుకు బస్సు డ్రైవర్ దారిచ్చాడు. దీంతో కారులో ఉన్న విద్యార్థులు బస్సు డ్రైవర్ సంతోష్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. ఘనాపూర్ చౌరస్తా వద్ద బస్సును ఆపి అతనిపై దాడి చేశారు.
అదే సమయంలో బస్సులో ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ మహేశ్‌పైనా దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్కూల్ కరస్పాండెంట్ జితేందర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనపై కూడా దాడి చేసి, అడ్డువచ్చిన స్థానికులపై వీరంగం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను అదుపులోనికి తీసుకున్నారు. స్టేషన్‌లో సైతం వారు హంగామా సృష్టించారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ సంతోష్, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవరేజికి వెళ్లిన మీడియా ప్రతినిధులతోనూ దురుసుగా ప్రవర్తించారు. సెల్ ఫోన్లు, కెమెరాలు లాక్కుని దౌర్జనన్యానికి పాల్పడ్డారు. మీడియాపై దాడిచేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు సీఐ వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు.