నారాయణ కాలేజీలో చదువు కోవాలని ఒత్తిడి పెడుతున్నారని.. కాలేజీలో నరకం కనిపిస్తోందని లేఖ రాసి పెట్టి ఇంట్లోంచీ వెళ్లిపోయిన హైదరాబాద్ అమ్మాయి సాయి ప్రజ్వల ఆచూకీ లభించింది. సాయి ప్రజ్వల క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర ఆమె తిరుగుతుండగా.. అప్పటికే టీవీలో చూసిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే.. సాయి ప్రజ్వలని అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు, హైదరాబాద్ పోలీసులకు, అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనితో ప్రజ్వల తండ్రి హుటాహుటిన తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఆయన వచ్చి తమ కుమార్తెను గుర్తించిన తరువాతనే ప్రజ్వల క్షేమమన్న విషయాన్ని నిర్ధారిస్తామని తిరుపతి పోలీసులు స్పష్టం చేశారు.
