శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పేరొందిన పిక్నిక్ స్పాట్, ప్రశాంత వాతావరణానికి మారుపేరైన రాజారాంపురం తీరంలోని జీడిమామిడి తోటలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. జలుమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామానికి చెందిన మెట్ట రాజశేఖర్(17) నరసన్నపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా ఇంటర్ సెకెండియర్ చదువుతోంది. రాజశేఖర్‌తో తమ అమ్మాయి రెండురోజుల క్రితం బయటకు వెళ్లిపోయినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు నరసన్నపేట పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజారాంపురం తీరంలో యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతున్నట్లు స్థానికుల నుంచి పోలాకి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలాకి ఎస్‌ఐ అబ్రహం, హెచ్‌సీ ధర్మారావు, సిబ్బందికి ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ రాజశేఖర్‌తో వెళ్లిన విద్యార్థిని ఎదురైంది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత యు వకుడి మృతదేహాన్ని కిందకు దింపి నరసన్నపేట ఆస్పత్రికి పోస్టుమార్టంకు తరలించారు. ఘటనా స్థలాన్ని నరసన్నపేట సీఐ పైడిపునాయుడు పరిశీలించారు.
అన్నీ పొంతన లేని మాటలే..
పోలీసుల అదుపులో ఉన్న మైనర్ విద్యార్థిని చెబుతున్న మాటలు పొంతన లేనివి గా ఉన్నాయి. ఓ ఆటోలో రాజశేఖర్ తనను ఇక్కడకు తీసుకువచ్చాడని, రాత్రం తా బీచ్‌లోనే ఉన్నామని, అయితే ఆటోతెచ్చిన వ్యక్తి మాత్రం తమతో లేడని చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యం లో ఆటోడ్రైవర్ ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఇంటి వద్ద తెలిసిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఇంకెవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా.. అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
సుబ్రహ్మణ్యపురంలో విషాదఛాయలు
జలుమూరు మండలంలోని సుబ్రహ్మణ్యపురం గ్రామానికి చెందిన మెట్ట రాజశేఖర్ పోలాకి మండలం రాజారాంపురం సముద్ర ఒడ్డున అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం ఉదయం నుంచి రాజశేఖర్ కనిపించకపోవడం, ఇంతలోనే మృతి వార్త తెలియడంతో తల్లిదండ్రులు మన్మధరావు, ఉమాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. –