వచ్చె నెల నవంబర్ 2 నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర విజయవంతమవుతుందనే భయంతో సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే సీఎం ప్రలోభాలు, ప్యాకేజీలతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
జగన్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని, పాదయాత్రతో ఆయనకు మరింత ఆదరణ పెరుగుతుందన్న భయంతో పాదయాత్రను తక్కువ చేయటానికి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విద్యార్థి దశ నుంచీ నేటివరకు తన రాజకీయ జీవితాన్ని అడుగడుగునా నీచంగా, హీనంగా, కుట్ర, మోసపూరితంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా సాగించారని దుయ్యబట్టారు. తమ పార్టీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి ఫిరాయించబోతున్నారనే వార్తల్ని పద్మజ ప్రస్తావిస్తూ వాటిని రేణుక ఖండించకపోవడం దారుణమన్నారు. ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓటేసి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా స్థాయి కల్పిస్తే ప్యాకేజీల కోసం పార్టీ ఫిరాయించడం దౌర్భాగ్యమన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు.