ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట వరంగా మారింది..గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులను చూసి చలించిపోయిన వైఎస్ మదిలో పుట్టిందే ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకం ద్వారా వైట్ కార్డు ఉన్న పేదలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం అందించింది వైఎస్ ప్రభుత్వం. లక్షలాది మంది పేదల ప్రాణాలను కాపాడింది ఈ ఒక్క ఆరోగ్యశ్రీ పథకం. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏర్సడిన ప్రభుత్వాలు కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా బలోపేతం చేశాయంటే ఈ పథకం ప్రజలకు ఎంతగా ఉపయోగపడిందో అర్థమవుతుంది..ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులతో బాధపడిన చిన్నారులకు ఆరోగ్యశ్రీ పథకం వరంగా మారింది. గుండెజబ్బు, కేన్సర్‌లాంటి జబ్బులతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులను ఎందరినో ఈ పథకం కింద చికిత్స అందించి బతికించారు వైద్యులు. ఇప్పటికీ ఆరోగ్య శ్రీ కింద చిన్నపిల్లలకు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి ఇదే విషయాన్ని తెలంగాణ డీఎంఈ డాక్టర్ కె. రమేష్ రెడ్డి చెబతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్లే 80 శాతం చిన్నపిల్లల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయగలుగుతున్నామని, తద్వారా వేలాది మంది చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్నామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ కె.రమేష్‌రెడ్డి అన్నారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో ఏపీ పీడియాట్రిక్ సర్జన్స్ సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ కె.రమేష్‌రెడ్డి మాట్లాడుతూ..వేలాది రూపాయలు ఖర్చు చేసి చికిత్స చేయించుకోలేని పేదలకు ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఈ పథకం వల్ల పీడియాట్రిక్ సర్జరీ విభాగాలు కూడా అభివృద్ధి చెందాయన్నారు. ఇలాంటి విభాగాలకు పీజీ వైద్యులు వెన్నెముకగా ఉంటారన్నారు. మొత్తానికి వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణలో మరింత బలోపేతం కాగా..ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకంగా మార్చి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తుంది..ఆరోగ్యశ్రీ పథకం ఉన్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరంజీవిగా వెలుగుతూనే ఉంటారు.
