ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వేదాంతం మాట్లాడారు .ఈ సారి సంస్కారం గురించి .ఏకంగా పిల్లల గురించి ..వారికి ఏమి చేయాలి .ఏమి నేర్పాలి .సంస్కారం నేర్పాలి అంటూ ఆయన పెద్ద లెక్చరర్ ఇచ్చారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమంసందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ, అబ్దుల్ కలాం పుట్టినరోజున ప్రతిభా అవార్డు పురస్కారాలు ఇవ్వడం సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టానని అన్నారు. ‘నేను ఒకటే నమ్ముతాను. రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీకే ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పడం లేదు..ఇరవై సంవత్సరాలుగా చెబుతున్నాను.
మన పిల్లలకు మనం ఎంత ఆస్తులు ఇస్తాం, ఎంత భూమి ఇస్తామనేది ముఖ్యం కాదు. మన పిల్లల్ని ఎంత బాగా చదివిస్తాం, ఎంత మంచి సంస్కారం నేర్పిస్తాం అనేది ముఖ్యం. చదువు.. తెలివినిస్తుంది, ఏదైనాసరే, సాధించే శక్తినిస్తుంది. అదేసమయంలో, సంస్కారం భవిష్యత్ కు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజున మనం ఆనందంగా ఉండాలంటే డబ్బు ఎంత ముఖ్యమో, మన సాంప్రదాయాలని, మన కుటుంబ వ్యవస్థను, అదేమాదిరిగా మనకున్న విలువలను మనం కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలి. పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడుతున్నారు’ అని ప్రశంసించారు.