బంగాళాఖాతంలోని తూర్పు మధ్య ప్రాంతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఇది ఉత్తర కోస్తాంధ్ర లేదా ఒడిశా వద్ద తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. ఉత్తర కోస్తా వద్ద తీరం దాటితే తెలంగాణలో 19వ తేదీ నుంచి వర్షాలు మళ్లీ బాగా పెరిగే సూచనలున్నాయి. దీనిపై ఈ నెల 18 నాటికి పూర్తి అంచనాలు వెలువడతాయి. ప్రస్తుతం రాయలసీమ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితల ఆవర్తనం ఉన్నందున తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఆది, సోమవారాల్లో ఇవి కాస్త తగ్గవచ్చని అంచనా. శనివారం పగలు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో కుంభవృష్టి మాదిరిగా 96.8 మిల్లీమీటర్లు, షాపూర్‌నగర్‌లో 42.5, కుత్బుల్లాపూర్‌లో 32.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా పలు ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షం కురిసింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షం నగరంలోని చాలా ప్రాంతాలను ముంచెత్తింది. ట్రాఫిక్ సమస్యతో జనం అవస్థలు పడ్డారు. హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పటికప్పుడు ఏర్పడుతున్న క్యుములోనింబస్ మేఘాల వల్ల కొద్ది గంటల్లోనే భారీ వర్షం కురుస్తోంది. అక్టోబరు ఒకటి నుంచి డిసెంబరు చివరి వరకూ ప్రస్తుత రబీ సీజన్‌లో హైదరాబాద్ నగరంలో మొత్తం సాధారణ సగటు వర్షపాతం 161 మి.మీ.లకుగాను గత 13 రోజుల్లోనే (శనివారం ఉదయానికల్లా) 107 మి.మీ.లు నమోదైంది. ఈ స్థాయిలో రాష్ట్రంలో మరే ప్రాంతంలోనూ అధిక వర్షపాతం నమోదు కాలేదు. నగరంపై కాలుష్యం అధికమవడం వల్ల ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో కొద్ది గంటల వ్యవధిలోనే అసాధారణ మార్పులు వస్తున్నట్లు వాతావరణ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించి, పచ్చదనాన్ని పెంచకపోతే భవిష్యత్తులో ఇలాంటి భారీ వర్షాలు, వేడి పెరుగుదల అనుభవాలు మరిన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు.
