సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎంతటి ఆపద నుంచైనా బయటపడొచ్చని ఓ బాలుడు నిరూపించాడు. తన చెల్లెలు పాము కాటుకు గురైనా ఏ మాత్రం ఆందోళన చెందకుండా.. నోటితో విషాన్ని తీసేసి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్తంగడీ తాలుకాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొక్కడ గ్రామంలో రాజు అనే పాడి రైతు కుటుంబం నివసిస్తోంది. ఆయన కుమార్తె 11 ఏళ్ల శరణ్య ఉదయాన్నే 4:30 గంటల సమయంలో పొరుగింటి వాళ్లకు పాలు ఇచ్చేందుకు వెళ్లింది. చీకట్లో కొంత దూరం వెళ్లగానే.. కాలిపై ఏదో కరిచినట్టు అనిపించింది. ఇంటికి తిరిగొచ్చిన శరణ్య జరిగిన విషయాన్ని అమ్మ, అన్నయ్యకు చెప్పింది.
తనను ఏదో కరిచిందని చెల్లెలు చెప్పిన వెంటనే 16 ఏళ్ల నితిన్‌కు నాన్నమ్మ చెప్పిన సలహా గుర్తొచ్చింది. శరణ్య కాలిపై రెండు కోరల గుర్తులు కనిపించాయి. దీంతో అమ్మ సాయంతో.. పాము విషం శరీరమంతా పాకకుండా పాము కరిచిన భాగానికి పైన వరి గడ్డితో కట్టు కట్టాడు. తర్వాత నోటితో విషాన్ని పీల్చి బయటకు ఉమ్మేశాడు.
వెంటనే శరణ్యను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ యాంటీ వెనమ్ లేకపోవడంతో మంగళూరులోని ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. 24 గంటల పాటు ఐసీయూలో ఉన్న ఆ అమ్మాయి మెల్లగా కోలుకుంది. విషాన్ని ముందే నోటితో తీసేయడంతో పాపకు ప్రాణ హాని తప్పిందని డాక్టర్లు చెప్పారు. గత ఆదివారం ఈ ఘటన జరగ్గా.. శరణ్య ఇప్పుడు ఏం చక్కా బడికి కూడా వెళ్తోంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చెల్లెలి ప్రాణాల్ని కాపాడిన నితిన్‌పై గ్రామస్థులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.