ఓ మంచి సంప్రదాయాన్ని పాటిస్తూ.. తోటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. మంత్రి కేటీఆర్. తన వరంగల్ పర్యటనకు ఒకరోజు ముందు.. కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తనకు స్వాగతం చెబుతూ వరంగల్ లో భారీగా వెలసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించి.. వాటిని ఏర్పాటు చేసిన వారికి జరిమానా విధించాలంటూ ఆయన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించడం సంచలనంగా మారింది.
ఇంకెవరికో సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశిస్తే.. అది రాజకీయంగా చేశారని అనుకుంటాం. అలాగే.. గతంలో ఒకరి ఫ్లెక్సీని మరొకరు చింపడమో తొలగించడమో చేస్తే.. విపరీతమైన గొడవలు జరగడం కూడా చూశాం. ఇన్నాళ్లూ ఫ్లెక్సీని ఓ గౌరవంగా భావించిన నాయకులను కూడా మనం చూశాం. కానీ.. ఏ ఉపయోగం లేని ఫ్లెక్సీలతో కలిగే ఉపయోగం కంటే.. పర్యావరణానికి కలిగే ముప్పే అధికమని ముందు చూపుతో గుర్తించిన మంత్రి కేటీఆర్.. ఏ మాత్రం ఆలోచన లేకుండా.. తన నిర్ణయాన్ని చెప్పేస్తున్నారు.
వరంగల్ పర్యటనకు సంబంధించి మాత్రమే కాదు. గతంలో.. తన పర్యటనలు ఎక్కడ జరిగినా.. ఫ్లెక్సీలతో హడావుడి చేయొద్దని.. తన పుట్టిన రోజు నాడు కూడా.. ఫ్లెక్సీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పవద్దని కేటీఆర్ చాలాసార్లు టీఆర్ఎస్ కార్యకర్తలను ఆదేశించారు.. అభిమానులకు విజ్ఞప్తులు చేశారు. ఇలా.. రాజకీయ నాయకుడిగా.. మంత్రిగా.. ఒక ఆదర్శవంతమైన విధానాన్ని పాటించడం చాలా బాగుందంటూ.. కేటీఆర్ తీరును అంతా మెచ్చుకుంటున్నారు.
ఇప్పటికే.. మంత్రిగా వీలైనన్ని శాఖలు నిర్వహిస్తూ.. ప్రతి శాఖకూ సరైన సమయం కేటాయిస్తూ.. ఎక్కడా పాలన గాడి తప్పకుండా సమర్థత చాటుకుంటున్న కేటీఆర్.. ఇలా తనకు మాత్రమే సాధ్యమైన విధానాలతో.. మరింత మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన తనయుడిగా.. తన పనితీరుతో నిరూపించుకుంటున్నారని అనిపించుకుంటున్నారు.
విభేదాలను పక్కన పెట్టి.. పార్టీలకు అతీతంగా మిగిలిన రాజకీయ నాయకులు కూడా అహాన్ని పక్కన పెట్టి.. కేటీఆర్ మాదిరిగానే.. ఫ్లెక్సీల సంస్కృతికి దూరంగా ఉండాలని.. ప్రజలు పిలుపునిస్తున్నారు. ఇది.. పర్యావరణానికి ఎంతో మంచి చేస్తుందని.. ఇలాంటి విషయంలో రాజకీయాలు చేయకూడదని కోరుకుంటున్నారు.