కడప జిల్లా రామాపురం మండలంలోని గురుకుల పాఠశాలకు ఎదురుగా ఉన్న మల్లిక స్వగృహంలో ఈ నెల 3వ తేదీన హత్యకు గురైనట్లు పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం విలేకర్ల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు వెళ్లడించారు. మృతురాలు మల్లికతో నిందితులు టి.వెంకటరమణ, నాగరాజు వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు. మల్లిక వీరిని గాక వేరే వారితో కూడా వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో పథకం ప్రకారం మృతురాలి తండ్రి ఆసుపత్రిలో ఉన్న సమయం చూసి ఒంటరిగా ఉన్నప్పుడు నాగరాజు కాళ్లుపట్టుకోగా వెంకటరమణ గొంతుపై కాలు పెట్టి హత్య చేశారు.
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చీరతో ఉరివేసి ఫ్యానుకు తగిలించారు. నిందితులు గురువారం స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎదుట లొంగిపోగా, ఆర్ఐ పోలీస్స్టేషన్లో హాజరుపరచారు. ఈ మేరకు కోర్టుకు హాజరుపరిచినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ పుల్లయ్య, ఎస్ఐ కృష్ణమూర్తి, ఏఎస్ఐ రాజుకుమార్, హెసీలు సుబ్బరాయుడు, జగన్నాయక్, పోలీస్సిబ్బంది పాల్గొన్నారు.