గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ఈ రహదారులపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత అధ్వాన్నంగా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగర రోడ్లు.గత పది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు సిటీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వానొస్తుందంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతున్నాయి. గుంతలు, పగుళ్లు వచ్చిన రోడ్ల కారణంగా వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవాల్సి వస్తోంది.
పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా తయారైనా అధికారుల తీరు కొంచెం కూడా మారలేదు. ఉదయం, సాయంత్రం రోడ్లపైకి రావాలంటే వాహనదారులు వెనకడుగు వేయాల్సి వస్తోంది. కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే వారి బాధలు వర్ణనాతీతం. తప్పనిసరై రోడ్లపైకి వస్తే ఇంటికి ఎప్పుడు చేరతామో తెలియని పరిస్థితి.
రోడ్లు, వీధులు, బస్తీలు, కాలనీలు.. ఎక్కడ చూసినా మోకాళ్లలోతు గుంతలుంటున్నాయి. కంకర తేలిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. సిటీలో ఇదేదో ఒక్క ప్రాంతానికే చెందిన సమస్య కాదు. హైదరాబాద్‌లోని 150 డివిజన్లలోని రోడ్ల దుస్థితి ఇది. ఇక సీసీ రోడ్లన్నీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో కొన్ని కిలోమీటర్లమేర ప్రధాన రోడ్లు అస్తవ్యస్థంగా తయారయ్యాయి.
ఇక అంబులెన్స్‌లలో వెళ్తోన్న పేషెంట్‌ల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే నరకయాతన అనుభవించాల్సిందే. వాహనదారులు ట్రాఫిక్ చక్రవ్యూహాన్ని చేధించాలంటే కత్తిమీద సాములా మారింది. అధికారుల సమన్వయలోపం కూడా రోడ్ల దుస్థితికి కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఇక రోడ్ల స్వరూపం ఇలావుంటే, మెట్రో రైలు మార్గాల్లో జరుగుతున్న పనుల కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని నిమిషాలు సాగాల్సిన ప్రయాణం గంటలు గడుస్తున్నా సాగుతూనే ఉంటుంది. ఈ సమస్యలకు రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండి.. రోడ్లు అధ్వాన్నంగా మారడమే ప్రధాన కారణం. రోడ్లపై దుమ్ము, ధూళి, కంకర తేలిన రోడ్లు, గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.