కాంట్రవర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోని ఓ కోణాన్ని తీస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది. రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి అంశాన్ని తీసుకోవడం టీడీపీకి ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ సినిమాను ఒకే యాంగిల్లో తెరకెక్కిస్తారేమోని, ఇంకే విషయాలు ప్రస్తావిస్తారోననే ఆందోళన వారిలో ఉందని అంటున్నారు.
దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం హఠాత్తుగా తాను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోనున్నట్లు ఎన్టీఆర్ తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు. ఆయన హఠాత్తుగా అలా ప్రకటించడం వెనుక ఏదైనా దాగి ఉందా అనే యాంగిల్‌ను, కొత్త కోణాన్ని రామ్ గోపాల్ వర్మ వెల్లడిస్తారా అనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా, ఎన్టీఆర్ చివరి రోజుల గురించి చెప్పాలంటే వైస్రాయ్ హోటల్ గురించి మాట్లాడాల్సిందే. వైస్రాయ్ ఘటనపై ఆయన ఏం చెబుతారనే ఆసక్తికర చర్చ సినీ, రాజకీయ వర్గాల్లో ఎంతో ఆశక్తిని రేపుతోంది. మరి మన మిస్టర్ వివాదాస్ ఫుల్ డైరెక్టర్ ఏంచేస్తారో చూడాలి.