రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి… నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా ఆజ్యం పోయబోతున్నారు.
అయితే ఆనాడు చంద్రబాబు.. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన ఘటన పైనే సర్వత్రా ఆశక్తి నెలకొంది. ఇక ఎన్టీఆర్‌కు మొత్తం ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడం లో వీరిలో ఎవరెవరు సహకరించారు, ఎవరు నిరాకరించారు, ఎవరు తటస్థంగా ఉండిపోయారు. హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, భువనేశ్వరి చంద్రబాబు వైపు నిలవగా, జయకృష్ణ, మోహనకృష్ణ, జయశంకర కృష్ణ, పురందరేశ్వరి రామారావు వైపు నిలిచారు. పత్రికలూ మాత్రం తమ ఇష్టం వచ్చినట్లు రాసి ప్రజలకు వాస్తవాలను అవాస్తవాలుగా ప్రకటించి నమ్మ బలికాయి.
ఆ సమయంలో ఎక్కువ ఛానెల్స్ లేవు. ఒక్క ఈటీవీ, జెమిని తప్ప. ఈటీవీ చంద్రబాబు వైపు తిరిగింది. అప్పుడు ఈనాడు పత్రిక ప్రచారం చేసిన అబద్ధాలు గోబెల్స్ ప్రచారాలను దాటిపోయాయి. చంద్రబాబు వైపు 20 మంది వస్తే 40 మంది వచ్చారని, ఆవార్త చూసి భయపడి మరో పదిమంది చంద్రబాబు శిబిరం వైపు పరుగెడితే, 80 మంది వచ్చారని, సాయంత్రానికి ఆ సంఖ్యను 140 దాటించింది. నిజానికి ఆ సమయంలో 60 మంది కూడా చంద్రబాబు వైపు లేరు. శాసనసభ్యులలో ఒక భయానక వాతావరణం ఏర్పడింది. నా తోటి ఎమ్మెల్యే వెళ్ళాడు.. నేను వెళ్లకపోతే నాకు మంత్రి పదవి రాదేమో అన్న భయం వారిలో కలిగింది. ఆ రకంగా సాయంత్రానికి మెజారిటీ ఎమ్మెల్యేలను చంద్రబాబు వైపు పరిగెత్తించడంలో రామోజీ రావు కుట్ర అనితర సాధ్యం. ఎన్టీఆర్ ఎంత గొంతు చించుకున్నా ఆయన మొరను ప్రజలకు చూపించేవాడే లేడు. నాడు మీడియా ఎన్టీఆర్ గోడును.. వర్మ ఇప్పుడు బయట పెడతాడా.. ఏది ఏమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు వెన్నుపోటు బయట పడుతుందో లేదో చూడాలి.