తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు వరంగల్ పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోగోను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తో కల్సిఆవిష్కరించారు.జిల్లాలో గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టెక్స్టైల్ పార్కు స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం మెగా టెక్స్టైల్ స్థలంలో డీపీఆర్ మ్యాప్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కాబోతుందన్నారు. ఇది తెలంగాణకే తలమానికంగా నిలవబోతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ పార్క్ ఏర్పాటు ద్వారా ఎక్కువగా మహిళలు ఉపాధి పొందుతారని వెల్లడించారు. పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోజే పలు కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకుంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు. టెక్స్టైల్ పార్క్ కాలుష్యరహితంగా ఏర్పాటు కాబోతుందన్నారు. ఈ పార్క్ ద్వారా వరంగల్ రూపురేఖలు మారుతాయన్నారు ..