కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీందో శనివారం శ్రీశైలంలో ఆరు గేట్లను ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 2లక్షల 33వేల 989 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ఆనకట్ట స్పిల్‌వే ద్వారా లక్షా 67వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్‌కు 73వేల 921 క్యూసెక్కుల వరదనీరు విడుదల అవుతోంది. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 11వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 24వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1688 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శనివారం 12గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 211.95 టీఎంసీలుగా నమోదైంది.
