భార్యపై అనుమానంతో కర్కషంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలోని పాత పెందుర్తి రామాలయం వీధిలో శుక్రవారం ఉదయం జరిగింది. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
పాత పెందుర్తిలో నివసిస్తున్న మునస మహాలక్ష్మినాయుడు (45), రాజేశ్వరి (36)లకు ఇరవై సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు వున్నారు. వీరిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. మహాలక్ష్మినాయుడు కొంతకాలం కిందట పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదురుగా పాన్‌షాప్ నిర్వహించేవాడు. నష్టాలు రావడంతో వ్యాపారం మాని, పినగాడిలో గల ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రాజేశ్వరి గాజువాకలోని ఒక బ్యూటీపార్లర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. రాజేశ్వరి వృత్తిరీత్యా ఫంక్షన్‌లు, వివాహ వేడుకలకు వెళ్లినప్పుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో మహాలక్ష్మినాయుడు అనుమానం పెంచుకున్నాడు. భర్త తరచూ అనుమానించి అవమానించడంతో రాజేశ్వరి వాదనకు దిగేది.
ఈ క్రమంలో మహాలక్ష్మి నైట్ డ్యూటీకి వెళ్లి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే భార్యాభర్తలు తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆ సమయంలో పిల్లలు కళాశాలకు వెళ్లిపోయారు. గొడవ ఎంతసేపటికీ ఆగకపోవడంతో కోపోద్రిక్తుడైన మహాలక్ష్మినాయుడు తీవ్ర ఆవేశంతో భార్య తలపై సమీపంలో గల క్రికెట్ బ్యాట్ తీసుకుని నాలుగుసార్లు తలపై మోదాడు. దీంతో ఆమె తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను హత్య చేసిన మహలక్ష్మినాయుడు ఏమీ జరగనట్టు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. స్టేషన్‌లో గల పోలీసులు పనేంటని అడుగగా తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, లేవడం లేదని చెప్పాడు. పోలీసులు 108కి సమాచారం అందజేశారు. బ్లూ కోట్స్ పోలీసులు నిందితుడిని బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వస్తుండగా అప్పటికే జనం గుమిగూడి వున్నారు. పోలీసులు ఇంటిలోపలకు వెళ్లి చూడగా రక్తపుమడగులో రాజేశ్వరి మృతదేహం కనిపించింది. పెందుర్తి సీఐ మురళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు వినియోగించి సంఘటనా స్థలంలో ముక్కలై వున్న బ్యాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహాలక్ష్మినాయుడును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.