స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే కాలేజీ స్టూడెంట్స్ వరకూ అందరికీ బైక్ అంటే ఓ తెలియని ఆకర్షణ. బైక్, నేటి యువతరం తప్పనిసరిగా ఉండాలని భావించే నిత్యావసరవస్తువు గా మారిపోయింది. అలాంటి ఓబైక్ కోసం ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డడు. తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు తీరని షోకాన్ని మిగిల్చిన ఘటన గురువారం చిత్తూరులో జరిగింది. దీనిపై ఫిర్యాదు లేకపోవడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేయలేదు.
స్థానికుల కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన బియ్యం వ్యాపారి కుమారుడు వేలూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. తనకు ద్విచక్ర వాహనం కొనివ్వాలని అడిగినా తండ్రి కొనివ్వలేదు. దీంతో ఆ విద్యార్థి అలిగి చిత్తూరు సమీపంలోని రైల్వే గేటు వద్ద వెనక్కి తిరిగి నిలబడ్డాడు. రైలు ఢీకొట్టడంతో దాదాపు 50 అడుగుల దూరంలో పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శుక్రవారం యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే పోలీసులు పేర్కొన్నారు.