కన్న కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల బాగోతం తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం సమీప గ్రామంలో వెలుగుచూసింది. తిరుమంగళం సమీపంలోని గ్రామానికి చెందిన జానవేలు, సీతాలక్ష్మీ దంపతులు. వారికి అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల కూతురు ఉంది. పదో తరగతిలో ఫెయిల్ అయిందనే ఆవేదనతో తన కూతురు అన్నలక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. పోలీసులు అన్నలక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా దిమ్మతిరిగిపోయే వాస్తవం వెలుగు చూసింది. అన్నలక్ష్మీ ఆత్మహత్య చేసుకోలేదని బలవంతంగా తాడును మెడకు చుట్టి బలవంతంగా హతమార్చారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో పోలీసులు అన్నలక్ష్మీ తల్లిదండ్రులు జానవేలు, సీతాలక్ష్మీలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అంతే నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. తన కూతురైన అన్నలక్ష్మీ గ్రామంలోని పలువురు యువకులతో చెడు తిరుగుళ్లు తిరుగుతుందని…దీనివల్ల తమ కుటుంబ పరువు పోతుందనే ఆవేదనతో తామే చంపామని తల్లిదండ్రులు అంగీకరించారు.కాగా పదహారేళ్ల కూతురు వేరే కులస్థుడిని ప్రేమించిందనే కోపంతో ఆమెను పరువు కోసం తల్లిదండ్రులు చంపారని పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు మృతురాలి ప్రేమికుడి కోసం గాలిస్తున్నారు.
