కర్నూల్ జిల్లా సంజామల మండలంలోని మిక్కినేనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి ఆ నలుగురి మృతదేహాలను తరలించారు. అయితే, ఆస్పత్రి మార్చురీలో నలుగురి మృతదేహాలు ఉంచగా.. మద్దమ్మ(70) అనే మహిళ లేచి కూర్చుంది. అప్పటి వరకు చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుండటంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
కాగా, విద్యుత్ షాక్ కారణంగా కోమాలోకి వెళ్లి.. ఇప్పుడే స్పృహలోకి వచ్చి ఉంటుందని వైద్యులు తెలిపారు. దద్దమ్మ తిరిగి లేవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన మద్దమ్మ మనవరాలు రజితను కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. ఈ విద్యుత్ షాక్ ఘటనలో సుకూర్ భాషా(35), ఉప్పరి సుధాకర్(20), ప్రవల్లిక(11) ప్రాణాలు కోల్పోయారు. మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ఈ ఐదుగురు రైతులు తమ పంట పొలానికి వెళుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. అడవి పందులు రాకుండా పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన కంచెకు విద్యుత్తు సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.