సమాజంలో ఎంతో మర్యాదగా బతుకుతున్న తమకు తమ కూతురి వల్ల తలవంపులు వస్తున్నాయని భావించిన ఆ తల్లిదండ్రులు చివరకు.. కన్నకూతుర్నే కానరాని లోకాలకు పంపించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం పరిధిలోగల ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
అయితే, అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతుర్ని మేం చంపలేదని, పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆవేదనతో తనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా..దిమ్మతిరిగిపోయే వాస్తవం వెలుగు చూసింది. అన్న లక్ష్మీ ఆత్మహత్య చేసుకోలేదనే విషయం పోస్టు మార్టం రిపోర్టులో వెల్లడైంది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం విచారణ చేపట్టిన పోలీసులు అన్నలక్ష్మీ తల్లిదండ్రులు జానవేలు, సీతాలక్ష్మీలను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. తమ కూతుర్ని తమే చంపామంటూ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. అన్నలక్ష్మీ చెడుగా తిరుగుతూ..తమ కుటుంబానికి తలవంపులు తెస్తుందన్న కారణంగా తామే ఈ ఉదంతానికి పాల్పడ్డామని పోలీసుల ఎదుట వారు అంగీకరించారు. తల్లిదండ్రుల విచారణ అనంతరం వారిని అరెస్టు చేసి.. మృతురాలి ప్రేమికుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా, ఇండియాలో పరువు హత్యలు ఎక్కువగా పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో జరుగుతుంటాయని ఇటీవల జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. ఇటువంటి హత్యలని కొందరు రాజకీయ నాయకులు కూడా బహిరంగంగా సమర్ధించడం గమనార్హం. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యల సంఖ్య పెరగడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ హత్యల పెరుగుదలపై మహిళా సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.