ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక జగన్ పాదయాత్ర తేదీని ప్రకటించినప్పటి నుండి ఏపీలో పెద్ద చర్చగా మారింది. అయితే జగన్ పాదయాత్ర పై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. జగన్ పాదయాత్రలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగానే పంచెకట్టులో పాదయాత్ర చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మంచి స్పందన వచ్చింది. పార్టీకి విజయాన్ని కూడా అందించింది. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ పంచెకట్టులో నిండుగా ఉండేవారు. ఆయనలో తెలుగుదనం ఉట్టిపడేది. రైతుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వైఎస్ కన్పించేవారు. ఆయన సాగించిన పాదయాత్ర ఫలితమే కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టింది. అదే ఊపు పదేళ్ల పాటు కొనసాగింది.
ఇప్పుడు తాజాగా ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా పాదయాత్ర చేపట్టారు. నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర దాదాపు ఆరు నెలలపాటు 125 శాసనసభ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే జగన్ యాత్ర ఎలా చేస్తారు? తండ్రి లాగానే పంచెకట్టులో చేస్తారా.. లేక మామూలుగానే ప్యాంట్, షర్ట్ తో చేస్తారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. తండ్రిలాగే పంచె కడితే జనంతో కనెక్ట్ అవుతామని కొందరు వైసీపీ నేతలు సలహా ఇచ్చారు. అయితే అందుకు జగన్ చిరునవ్వుతోనే సమాధానం చెప్పారట. పంచెకట్టులో పాదయాత్రకు వెళతారన్న ప్రచారం ఊపందుకుంది. పాదయాత్రకు అవసరమైన అన్ని హంగులూ సిద్ధం చేస్తున్నారు. పాదయాత్రకు ముందే జగన్ అన్ని వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఆయన వెంట ఒక డాక్టర్ల బృందం కూడా ఉండేలా వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం మీద జగన్ పంచెకట్టులో పాదయాత్ర చేపడితే మంచి ఊపొస్తుందని మాత్రం వైసీపీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం పాదయాత్రను తాను సహజంగా ధరించే దుస్తులతోనే చేశారు. మరి జగన్ పాదయాత్రకి ఎలా బయలుదేరుతారో చూడాలని సర్వత్రా చర్చించుకుంటున్నారు.