సాహసాలతో సహవాసం చేయడం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి అలవాటుగా మారింది.. . గతంలో బయ్యారం ఫారెస్టులో 12 కిలోమీటర్లు నడిచి సంచలనం రేపిన ఆమ్రపాలి ఆ తర్వాత
అత్యంత సాహసోపేతంగా పాండవుల గుట్టల్లో జరిగిన రాక్ ఫెస్టివల్‌లో ఎత్తైన గుట్టలు అవలీలగా ఎక్కి ఔరా అనిపించారు. తాజాగా ఆమ్రపాలి మళ్లీ మరోసారి ట్రెక్కింగ్ చేశారు. ఈ రోజు వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమ్రపాలి మాట్లాడుతూ…తనకు ట్రెక్కింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఇనుపరాతి గుట్ట ట్రెక్కింగ్ అనువైనదని సందర్శకులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ ట్రెక్కింగ్ లో నిట్, కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు వహిస్తూనే సాహసమహిళగా తన ప్రతిభాపాటవాలను చాటుకుంటున్న ఆమ్రపాలిని తెలంగాణ ప్రజలు అభినందిస్తున్నారు.