ప్రపంచ వ్యాప్తంగా దేశాలతో సంబంధం లేకుండా 13వ నంబర్‌ను దురదృష్ట సంఖ్యగా చూస్తారు. అందులోనూ ఓ నెలలో ఇదే తేదీన శుక్రవారం వస్తే దానిని మరింత డేంజర్‌గా భావిస్తారు. ఇవాళ ఫ్రైడేనే. అందులోనూ 13వ తేదీ. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిని దురదృష్టంగా భావించేవాళ్లు ఇవాళ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇదీ ఓ ఫోబియానే. దీనికి ఫ్రిగాట్రిస్కైడెకా ఫోబియా అనే పేరు పెట్టారు. ఈ రోజుల్లోనూ ఎంతగానో అభివృద్ధి చెందిన అమెరికాలాంటి పాశ్చాత్య దేశాల్లో ఫ్రైడే 13ను ఓ దురదృష్టంగా భావించడం విశేషం. ఈ రోజు మంచిది కాదు అనేందుకు గతంలో జరిగిన ఘటనలను కొందరు ఉదాహరణలుగా చెబుతుంటారు.
13.. ఓ అన్‌లక్కీ నంబర్
ఇప్పటికీ 13వ నంబర్‌ను చూస్తేనే చాలా మంది వణికిపోతారు. 12ను పరిపూర్ణ సంఖ్యగా భావిస్తారు. ఏడాదిలో 12 నెలలు, 12 రాశులు, గడియారంలో 12 గంటలు ఇలా 12కు ఓ పరిపూర్ణత ఉంది. అయితే ఆ తర్వాత వచ్చే 13ను మాత్రం ఇప్పటికీ దురదృష్టమనే అంటారు. చాలా వరకు భవనాల్లో 13వ అంతస్తు ఉండదు. ప్రయాణాల్లో 13వ వరుసలో కూర్చోవడానికి కొంతమంది జంకుతుంటారు.
అమెరికన్లకే ఈ ఫోబియా
ఫ్రైడే 13 ఫోబియా అమెరికన్లకు చాలా ఎక్కువ. ఈ ఫోబియా వల్ల అగ్రదేశానికి ప్రతి ఏడాది 80 నుంచి 90 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని నార్త్ కరోలినా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ సెంటర్ వెల్లడించింది. ఫ్రైడే 13 ఫోబియా ఉన్నవాళ్లు ఆ రోజు ఏ పనీ చేయకుండా ఇళ్లకే పరిమితం కావడమే దీనికి కారణం. ఒక్క అమెరికాలోనే సుమారు 2 కోట్ల మంది ఈ ఫోబియాతో బాధపడుతున్నారు. దీనిపై సినిమాలు కూడా వచ్చాయి. 1980ల్లో ఫ్రైడే ద థర్టీన్త్.. హారర్ మూవీ సిరీస్ అమెరికన్లలో ఈ ఫోబియాను మరింత పెంచింది. 2009లో ఈ సిరీస్‌లో చివరి సినిమా వచ్చింది.
ఫ్రైడే 13పై ఎన్నో అధ్యయనాలు
ప్రపంచవ్యాప్తంగా ఫ్రైడే 13 ఫోబియాపై ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. అయితే డచ్ సెంటర్ ఫర్ ఇన్సూరెన్స్ స్టాటిస్టిక్స్ జరిపిన ఓ అధ్యయనం మాత్రం ఆసక్తి కలిగిస్తున్నది. శుక్రవారం 13వ తేదీన ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నట్లు వీళ్లు గుర్తించారు. ఈ లెక్కన ఇవాళ డ్రైవింగ్ సేఫ్ అంటూ ఈ అధ్యయనం తేల్చింది. ఇది మనం నమ్మొచ్చా అంటే ఎవరి నమ్మకాలు వారివి. చెడు జరిగినవాళ్లు మంచిది కాదు అనుకుంటారు.