భారత్-ఆస్ట్రేలియా టీ-20 క్రికెట్ మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు మొదలవనున్న మ్యాచ్ కోసం సుమారు 1,800 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి మ్యాచ్‌కు అనుమతించని నిషేధిత వస్తువుల జాబితాలో కొత్తగా గొడుగును చేర్చారు. వర్షం వచ్చే అవకాశముంది కదా అని వీక్షకులు గొడుగులు తీసుకొస్తే లోపలికి అనుమతించబోమని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. వీక్షకుల్ని స్టేడియం లోపలికి సాయంత్రం నాలుగు గంటల నుంచే అనుమతిస్తామని వెల్లడించారు. మ్యాచ్ సాఫీ నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యల్ని గురించి హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శేషునారాయణ, మల్కాజిగిరి, ట్రాఫిక్ డీసీపీలు ఉమామహేశ్వరశర్మ, రమేశ్‌నాయుడు, అదనపు డీసీపీ దివ్యచరణ్‌తో కలిసి గురువారం విలేకరులకు వివరించారు.
నిషేధిత వస్తువులు ఇలా…
* గొడుగులు
* ల్యాప్‌టాప్‌లు
* బ్యానర్లు
* నీళ్ల సీసాలు
* కెమెరాలు
* సిగరెట్లు
* ఎలక్ట్రానిక్ ఉపకరణాలు
* అగ్గిపెట్టెలు
* బైనాక్యులర్లు
* నాణేలు
* పెన్నులు
* శిరస్త్రాణాలు
