హైకోర్టు విభజనపై ఇంతలా జాప్యం చేయడం కేంద్ర ప్రభుత్వానికి తగదని, ఇప్పటికే సమయం మించిపోయింది.. ఇంకా వేచి చూసే ఓపిక లేదని ఎంపీ వినోద్ అన్నారు. కాగా, నేడు ఎంపీ వినోద్ కుమార్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. మోడీకి రాసిన ఈ లేఖలో ఎంపీ వినోద్ కుమార్ పై విధంగా పేర్కొన్నారు. ఇంకా.. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మూడేళ్లు గడుస్తున్నా..తెలంగాణకు ఇచ్చిన హామీలు అపరిష్కృతంగానే ఉన్నాయని, ఇప్పటి వరకు నియోజకవర్గాల పునర్విభజనలో ముందడుగు వేయకపోవడం కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూస్తుందన్నదానికి నిదర్శనమన్నారు. అవసరమైతే సెక్షన్ 26ను సవరించైనా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. లేకుంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎంపీ వినోద్ కుమార్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
