ప్రభుత్వాల ప్రచారానికి మద్దతుగా నేను ఒక్క కొడుకుతో కుటుంబ నియంత్రణ పాటించాను. కాని ఇప్పుడు అలా చేయడం తప్పు. మన వెనుకటి తరం ఇలాగే ఆలోచిస్తే మనం లేకపోయేవాళ్లం. అందుకే ఒక్కరు కాకుండా ఇద్దరు లేదా ముగ్గురిని కనాలంటూ చంద్రబాబు నాయుడు తాజాగా ఒక మీటింగ్‌లో చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుటుంబ నియంత్రణ పాటించాలనేది ఒకప్పటి విధానమన్నారు. గురువారం విజయవాడలో రామినేని ఫౌండేషన్ 18వ వార్షిక అవార్డు ప్రదానోత్సవానికి సీఎం చంద్రబాబు, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరికి విశిష్ట సేవా పురస్కారం ప్రదానం చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ వేముగంటి గీత, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, పాపులర్ తెలుగు డ్రామా యాక్టర్ ఆర్.నాగేశ్వరరావు (సురభి బాబ్జి)లకు విశేష పురస్కారాలు అందచేశారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ రామినేని అయ్యన్న చౌదరి ఆశయాల సాధన కోసం ఆయన కుటుంబం కృషి చేయడం అభినందనీయమని సీఎం ప్రశంసించారు.
సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న వారిని గుర్తించి అవార్డులు అందచేయడం ఆనందకరమని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, డీజీపీ సాంబశివరావు, ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ జీఎన్ రావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం, ఛైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, సభ్యులు శారదాదేవి, సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, హరిశ్చంద్ర తదితరులు పాల్గొన్నారు.