ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో, తెలంగాణ కాంగ్రెస్ నేతల హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు దగాపడ్డాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ అసలు పేరు నందికొండని తెలిపారు.
ప్రాజెక్ట్ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా 19 కిలోమీటర్ల ఎగువన ఏళేశ్వరం వద్ద నిర్మించాల్సిఉండేనని చెప్పారు. సమైక్యవాదులు ఆనాడు మోసం చేసి ప్రాజెక్టును దిగువన నిర్మించారు. దీంతో పాలమూరు, నల్లగొండ జిల్లాల ప్రజలకు త్రాగునీరు, భూములకు సాగునీరు కరువైంది. దీంతో అనివార్యంగా ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య తలెత్తిందన్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఫ్లోరైడ్ యాత్ర చేపట్టినట్లుగా తెలిపారు. మునుగోడు, దేవరకొండ వంటి ప్రాంతాలను సందర్శించినప్పుడు కొన్నిచోట్ల కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కుడి, ఎడమ కాల్వలు ఉన్నాయి. ఇరు కాల్వల మీద లిఫ్ట్‌లు ఉన్నాయి. కుడి కాల్వ మీద ఉన్న లిఫ్ట్‌ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించేది. కాగా ఎడమకాల్వ మీద ఉన్న లిఫ్ట్‌ల నిర్వహణ ఖర్చులను రైతుల వద్ద వసూలు చేసేవారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎడమకాల్వ రైతుల హక్కుల కోసం కోదాడ నుంచి హాలియ వరకు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. దీంతో అప్పటి ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఎడమకాల్వ లిఫ్ట్‌ల నిర్వహణను కూడా తామే చూస్తామని ప్రకటించిందన్నారు. అనాడుగానీ, ఈనాడుగానీ ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చేసిందేమీ లేదని సీఎం పేర్కొన్నారు.