సూపర్ స్టార్ మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో భారి అంచనాల మధ్య విడుదలైన స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. భారి రేమ్యునరేషన్లు, పెద్ద బడ్జెట్, రెండు భాషల్లో చిత్రీకరించడం .. ఈ కారణాల వలన స్పైడర్ బిజినెస్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. దాంతో నష్టాలు కూడా భారి స్థాయిలో వచ్చాయి. దాంతో 20 కోట్ల నష్టాలతో ఆగిపోవాల్సిన సినిమా ఇప్పుడు ఏకంగా 60 కోట్ల దాకా నష్టాలు తీసుకువస్తోంది.
దాంతో పంపిణిదారులు ఫిలిం చాంబర్ ని ఆశ్రయించారు. తమ నష్టాల్ని కంపెంసేట్ చేయాల్సిందే అంటూ గోల చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. మొదట మహేష్ కొంత పారితోషికం, మురుగదాస్ కొంత పారితోషికం, లాభాల్లోంచి నిర్మాతలు కొంత తీసి, అంతా కలిసి నష్టాల్ని పంచుకుందామని భావించినా, ఓ కొత్త ప్రపోజల్ పంపిణిదారుల ముందుకి తీసుకువచ్చారు. మహేష్ మళ్ళీ ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లతో సినిమా తీస్తాడని, ఆ సినిమాని చాలా తక్కువ రేట్లకి నష్టపోయిన పంపిణిదారులకే ఇస్తామని అన్నారు. కాని ఈ ప్రపోజల్ కి అస్సలు ఒప్పుకోవడం లేదు పంపిణిదారులు.
ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో ఇలాంటి డీల్ తేడా కొట్టింది. సరిగ్గా ఇలాంటి డీల్ కె ఒప్పుకున్న సర్దార్ పంపినిదారులకు, అదే బ్యానర్ లో పవన్ కళ్యాణ్ చేసిన కాటమరాయుడు హక్కులు దక్కలేదు. దాంతో వారు రోడ్డు మీద ధర్నాలు చేసిన సంగతి మీకు తెలిసిందే. అలాంటి పరిస్థితి మాకు వద్దు, మాకు ఎవరి మీద కూడా నమ్మకం లేదు, ఎలాంటి డీల్ వద్దు, నష్టాల్ని పూడ్చండి చాలు అంటూ తేల్చేసారు. ఇక నష్టాలకి మహేష్ ఒక్కడే బాధ్యత వహించకుండా, నిర్మాతలు, దర్శకుడు తలో చేయి వెయ్యాలని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. మరి పంచాయితీలో ఈ కొత్త పంతం కథని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.