ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అని మహేష్ పోకిరి డైలాగ్ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వాడుతున్నారు గులాబీ శ్రేణులు. ఎవరు కొడితే చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే కేసీఆర్ అంటున్నారు గులాబీ కార్యకర్తలు..స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దెబ్బకు తెలంగాణలో టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అయింది. మాజీ మంత్రి , ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న కమ్మ సామాజికవర్గం కేసీఆర్‌కు జై కొడుతోంది. ఆ తర్వాత టీటీడీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు. తుమ్మల మ్యాజిక్‌తో ఖమ్మం జిల్లా గులాబీ ఖిల్లాగా మారింది. సింగరేణి ఎన్నికల విజయంతో మాంచి ఊపు మీదున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మరో పెద్ద స్కెచ్ వేయబోతున్నట్లు సమాచారం. టీటీడీపీలో రేవంత్ మినహా మిగిలిన నాయకులందరిని గుంపుగుత్తగా కారు ఎక్కించి టీటీడీపీ ఛాప్టర్ క్లోజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మోత్కుపల్లి , రమణ, రావుల చంద్రశేఖర్ లాంటి సీనియర్ నేతలు టీఆర్‌ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారు..అలాగే చోట్ల మాజీ టీడీపీ నేతలను చేర్చుకుని టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల బరిలో దింపేందుకు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం.
జయశంకర్ జిల్లాలో ములుగు మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత సీతక్కను టీఆర్ఎస్‌లోకి రప్పించే బాధ్యతను మంత్రి తుమ్మలకు అప్పగించినట్లు సమాచారం..అలాగే తనకు వ్యతిరేకంగా రెడ్డి సామాజికవర్గం నేతలు ఏకమవుతుండడంతో కేసీఆర్ మిగిలిన సామాజికవర్గాలపై ఫోకస్ పెట్టాడు.. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 35 నియోజకవర్గాల్లో కీలక నిర్ధాయక శక్తిగా ఉన్న కమ్మ సామాజికవర్గ నేతలను కారు ఎక్కించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నాడు. ఒకప్పుడు నిజామాబాద్‌లో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన టీడీపీ సీనియర్ నేత, కమ్మ సామాజికవర్గానికే చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును పార్టీలోని రప్పించి డిచ్‌పల్లి ఎమ్మెల్యే టికెట్ కానీ, ఎమ్మెల్పీ లేదా మంత్రి పదవి ఇలా బంపర్ ఆఫర్లు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో టీడీపీ పతనావస్థకు చేరుకోవడంతో మండవ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఆయనకు మంచి పేరు ఉంది. అవినీతికి ఆమడదూరంలో ఉండే నిజాయితీపరుడు, మంచిమనిషిగా జిల్లా ప్రజలు ఆయన్ని అభిమానిస్తారు. అందుకే కేసీఆర్ మండవను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను మంత్రి తుమ్మలకే అప్పజెప్పినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే నిజామాబాద్ జిల్లాలో మండవ చేరిక టీటీడీపీలో కలకలం రేపడం ఖాయం..ఇప్పటికే అంపశయ్య మీద ఉన్న టీటీడీపీ ఇంకాస్త ముక్కలు అవడం ఖాయంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల కల్లా టీటీడీపీలో ఎవరూ మిగలని పరిస్థితి రాబోతుంది..ఏకాకి అయిన రేవంత్ కాంగ్రెస్‌కో, బిజేపీ పార్టీలోకో వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్‌లో మండవ చేరబోతున్నట్లు వస్తున్న వార్తలతో తెలంగాణ టీడీపీలో గందరగోళం మొదలైంది. మరదే కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాక్ అవడం ఖాయమని గులాబీ శ్రేణులు అంటున్నాయి.